దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీల్లో యువతకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్’ దరఖాస్తుల గడువు ముగుస్తోంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీనే చివరి రోజు. దీని ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 స్టైపెండ్‌తో పాటు జాయినింగ్ గ్రాంట్ కింద అదనంగా ఆర్థిక సాయం కూడా అందుతుంది.18 నుండి 25 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ప్రస్తుతం ఎలాంటి పూర్తిస్థాయి ఉద్యోగం చేయని యువత ఈ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అయితే, అర్హత ఉన్నప్పటికీ కొంతమందికి ఈ స్కీమ్‌లో అవకాశం దక్కకపోవచ్చు. ఎందుకంటే ఐఐటీ (IIT) లాంటి విద్య సంస్థల్లో చదివిన స్టూడెంట్స్‌కు ఇందులో దరఖాస్తు చేసుకునే వీల్లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన అభ్యర్థులు, ఇప్పటికే ఎక్కడైనా ఫుల్-టైమ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అప్లై చేయలేరు.
ఆసక్తి ఉన్నవాళ్లు mybharat.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, లింకు కింద ఇవడం జరిగింది. కాకపోతే ఈ ప్రాసెస్‌లో అభ్యర్థులు కొన్ని విషయాలు గమనించడం అవసరం. దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో వెబ్సైట్లో ప్రొఫైల్ వెరిఫికేషన్ అవ్వడానికి కాస్త సమయం పడుతోంది. పైగా అప్లోడ్ చేసే డాక్యుమెంట్లు, ప్రొఫైల్‌లో ఇచ్చే వివరాల మధ్య చిన్న తేడాలు ఉన్నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటర్న్‌షిప్ లొకేషన్ల ఎంపిక. కొన్ని కంపెనీలు ఇచ్చే లొకేషన్లు అభ్యర్థుల సొంత ఊర్లకు చాలా దూరంగా ఉంటున్నాయి. ఇచ్చే ఐదు వేల స్టైపెండ్‌తో వేరే ఊరిలో రూమ్ రెంట్, ప్రయాణ ఖర్చులు చూసుకోవడం ప్రాక్టికల్‌గా ఎంతవరకు వీలవుతుందనేది అభ్యర్థులు ముందే లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుని ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేయడం బెటర్. గడువు ముగిసే కొద్దీ సర్వర్లు స్లో అయ్యే నెట్వర్క్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆలోపే ప్రాసెస్ పూర్తి చేయడం మంచిది.







