ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో సూపర్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 731 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు వేగవంతం చేసినట్లు మంత్రులు వెల్లడించారు. ఇందులో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులతో పాటు, దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
విద్యుత్ శాఖలో 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ… విద్యుత్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు, పనులను వేగవంతం చేసేందుకు గాను 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. కేవలం రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో కొత్తగా 200 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామని, దీనివల్ల పెరిగిన పనిభారానికి తగ్గట్టుగా ఈ కొత్త నియామకాలు చేపట్టబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇదొక పెద్ద అవకాశం కానుంది.
దేవదాయ శాఖలో 106 ఎగ్జ్యూటివ్ ఆఫీసర్ పోస్టులు
మరోవైపు, రాష్ట్రంలోని వివిధ ప్రముఖ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీ ప్రక్రియపై ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ బాధ్యతను ఏపీపీఎస్సీ కి అప్పగించామని, పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు మరియు కసరత్తు ప్రస్తుతం నడుస్తోందని ఆయన తెలిపారు.
నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది?
మంత్రుల ప్రకటన ప్రకారం ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిపార్ట్మెంట్ల వారీగా అనుమతులు లభించాయి. ఏపీపీఎస్సీ మరియు విద్యుత్ శాఖల ద్వారా వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్లు, సిలబస్ మరియు పరీక్షల షెడ్యూల్ వివరాలు వెబ్సైట్లలో త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు సడలింపుల పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందుబాటులోకి వస్తాయి.










